Read more!

దేహం మీద వ్యామోహం పోవాలంటే ఈ విషయం తెలుసుకోవాలి!

 

దేహం మీద వ్యామోహం పోవాలంటే ఈ విషయం తెలుసుకోవాలి!

సకల వ్యామోహాలకూ, సర్వ వికారాలకూ మూలమైన ఈ మానవదేహం అనిత్యమని శ్రీకృష్ణపరమాత్ముడు  అన్నాడు. అదే విషయాన్ని  సరళసుందరంగా వ్యాఖ్యానించారు అన్నమాచార్య. సంక్లిష్టమైన వేదాంతసారాన్ని 'దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు' అన్న తన కీర్తనలో అచ్చమైన తేటతెలుగు పదాలతో పరిచయం చేశారు ఆ పదకవితా పితామహుడు. అశాశ్వతమైన ఈ శరీరం కోసం అపురూపమైన జీవితాన్ని వెచ్చిస్తూ నిరర్థకంగా కాలాన్ని గడిపేస్తున్నాం. నిత్యమూ, సత్యమూ అయిన 'ఆత్మ'ను విస్మరిస్తున్నాం. అందుకే దేహాన్ని గురించి, దేహాన్ని ధరించే దేహి గురించి  'భగవద్గీత'లోని  సాంఖ్య యోగంలో...

వాసాంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృష్ణతి నరో పరాణి | 
తథా శరీరాణి విహాయ జీర్ణా 
న్యన్యాని సంయాతి నవాని దేహీ || 
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః | 
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః |
అచ్ఛేద్యో... యమదాహ్యో యమద్యో శోష్య ఏవ చ | నిత్యస్సర్వగతః స్థాణురచలో_యం సనాతనః ॥ 

అని అంటాడు శ్రీకృష్ణుడు. . అంటే "మనిషి జీర్ణవస్త్రాలను పరిత్యజించి నూతన వస్త్రాలను ధరించినట్లు, జీవాత్మ కూడా జీర్ణమైన దేహాన్ని విడిచి నూతన దేహాన్ని పొందుతుంది.  ఎట్టి శస్త్రమైననూ ఈ ఆత్మను ఛేదింపజాలదు, ఈ ఆత్మను అగ్ని దహించలేదు. నీరు తడుపజాలదు. గాలి ఎండింపజాలదు.  ఆత్మ నిత్యము, సర్వ వ్యాప్తము, స్థిరము, అచలము, సనాతనము.”

అద్భుతమైన ఈ భగవద్గీత శ్లోకాన్ని అన్నమాచార్య అలతి అలతి పదాలతో పామరులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తాడు. కురుక్షేత్రంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన మరికొన్ని భగవద్గీతా శ్లోకాల్ని కూడా ఈ భక్తాగ్రేసరుడు తేటతెలుగులో అనుసృజించాడు.

మనసా మరవకు మీ....

తనువు తళుకు బెళుకుల కోసం తపించే మనస్సును హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య. పెరిగే వయస్సుతో, తరిగే ఆయుష్షుతో దినదినం శుష్కించిపోతున్న ఈ దేహం అనిత్యమైనది. ఇలాంటి దేహాలు శాశ్వతమైనవి కావని కోరికలకు కారణమైన మనస్సుకు హితవు పలుకుతున్నాడు. అశాశ్వతమైనదేహాల్ని ఎన్నింటినో ధరించే 'దేహి' అంటే 'ఆత్మ' మాత్రం నిత్యమైనదని స్పష్టం చేస్తున్నాడు.

దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు ఈహల నా మనసా ఇదు మరవకు మీ... అంటున్నాడు.

ముఖ్యంగా మన ఆలోచనలన్నింటినీ దేహానికే పరిమితం చేస్తుంది 'మనస్సు'. అంతకు మించి ఆలోచించే అవకాశమివ్వదు. అందుకే అక్కడ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి హెచ్చరిస్తే, ఇక్కడ అన్నమాచార్య తన మనస్సును అప్రమత్తం చేస్తున్నాడు. 'ఈహ' అంటే కోరిక. కోరికలను కట్టడి చేయమంటున్నాడు.  ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషికి దేహం మీద వ్యామోహం పోతుంది.

                                            *నిశ్శబ్ద.